: జేఎన్యూకు ‘యాంటి నేషనల్’ ట్యాగ్!... వివాదంలో ‘గూగుల్’ మ్యాప్
సెర్చింజన్ జెయింట్ ‘గూగుల్’ పెను వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి తన గూగుల్ మ్యాపుల్లో ‘యాంటీ నేషనల్’ ట్యాగ్ తగిలించింది. పార్లమెంటుపై జరిగిన దాడిలో కీలక నిందితుడిగా తేలిన అఫ్జల్ గురూకు అమలైన ఉరిశిక్షను నిరసిస్తూ ఫిబ్రవరి 9న వర్సీటీలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కన్నయ్య కుమార్ ఆయన మిత్ర బృందం జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగిన ఈ వ్యవహారంలో కన్నయ్యతో పాటు పలువురు విద్యార్థులు అరెస్టయ్యారు. కన్నయ్యకు బెయిల్ నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులు కాస్తంత కుదుటపడుతున్న తరుణంలో గూగుల్ మ్యాపుల్లో జేఎన్యూ వర్సిటీకి ‘యాంటి నేషనల్’ ట్యాగులు కనిపించడం వివాదాస్పదంగా మారింది.