: గుడ్ ఫ్రైడే సందర్భంగా భారత మతాధికారిని చంపాలని నిర్ణయించిన ఐఎస్ఐఎస్!
ఈ నెల నాలుగవ తేదీన యమన్ లోని ఓ వృద్ధాశ్రమం నుంచి నలుగురు నన్స్ సహా 16 మందిని కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వారిలోని భారత క్రిస్టియన్ మతాధికారి టామ్ ఉళున్ నలిల్ ను గుడ్ ఫ్రైడే సందర్భంగా చంపాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. మిషనరీస్ నడుపుతున్న ఈ వృద్ధాశ్రమంలోని మిగతా వారు ఈ వార్త విని తీవ్ర భయాందోళనలో ఉన్నారని 'ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కిడ్నాపైన నాటి నుంచి ఫాదర్ ఉళున్ నలిల్ నుంచి ఎటువంటి సమాచారమూ రాలేదని తెలుస్తోంది. అయితే, ఆయన్ను తీవ్రంగా హింసిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని 'ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ ఆఫ్ సైసేన్' తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టారు. ఆయన్ను శుక్రవారం చంపాలని కూడా ఉగ్రవాదులు నిర్ణయించినట్టు తెలిపారు. కాగా, ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం తమ వద్ద లేదని, ఆయన కోసం ప్రార్థిస్తున్నామని, గతంలో నలిల్ పనిచేసిన బెంగళూరు క్రిస్టియన్ సంస్థ సలేసియన్ సిస్టర్స్ ఆఫ్ డాన్ బాస్కో సభ్యుడొకరు తెలిపారు.