: అరెస్టయిన హెచ్ సీయూ విద్యార్థులకు ఓవైసీ మద్దతు... చర్లపల్లి జైలుకు వెళ్లి పరామర్శించిన వైనం
హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ విద్యార్థులకు మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మద్దతు పలికారు. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వర్సిటీ ఒక్కసారిగా నిప్పుల కుంపటిలా మారింది. ఈ క్రమంలో రోజుల తరబడి వర్సిటీలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్సిటీ వీసీ పొదిలె అప్పారావు సెలవుపై వెళ్లడంతో పరిస్థితి కాస్తంత సద్దుమణిగినా, ఆయన తిరిగి విధుల్లో చేరడంతో మళ్లీ రణరంగంగా మారింది. ఈ క్రమంలో వీసీ ఇంటిపై దాడి చేయడమే కాక తమను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా విద్యార్థులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేయడమే కాక అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. కొద్దిసేపటి క్రితం విద్యార్థులకు సంఘీభావం తెలిపిన ఓవైసీ... చర్లపల్లి జైలుకు వెళ్లి మరీ వారిని పలకరించారు.