: బంగారానికి వడ్డీగా బంగారమే కావాలట!.... ఈ కారణంగానే వెంకన్న పసిడి ‘గోల్డ్ స్కీమ్’కు చేరలేదు!
దేశంలో గల్లా పెట్టెలు, బీరువాల్లో దాగిన బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘గోల్డ్ మొనటైజేషస్ స్కీం’కు ఏమాత్రం ఆదరణ లభించలేదు. జనం స్పందించకపోయినా, కనీసం మీరైనా స్పందించండి అంటూ వచ్చిన వినతికి ఆదిలో ఉత్సాహంగా స్పందించిన ఆలయాలు, ఆ తర్వాత స్పందించడం మానేశాయి. అసలు ఆ పథకం వైపు ఆలయాలు కన్నెత్తి చూడటం లేదు. వెరసి ప్రధాని ‘గోల్డ్ స్కీమ్’ డిపాజిట్లు లేక వెలవెలబోతోంది. అయినా బ్యాంకుల్లోనే ఉండే ఆలయాల బంగారాన్ని గోల్డ్ పథకానికి తరలించేందుకు ఆయా ఆలయాలు ఇష్టపడకపోవడానికి కారణాలు ఏమిటన్న దిశగా పరిశీలన జరపగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ప్రధానమైనది వడ్డీ రూపంలో జరపాల్సిన చెల్లింపులు. భక్తుల నుంచి టన్నుల కొద్దీ బంగారం వెంకన్న సన్నిధికి చేరింది. ఈ బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ వస్తోంది. ఈ బంగారానికి ఆయా బ్యాంకులు వడ్డీ కింద బంగారాన్నే ఇస్తున్నాయి. ప్రధాని గోల్డ్ పథకంలో డిపాజిట్ చేసే బంగారానికి కూడా బంగారాన్నే వడ్డీగా చెల్లించాలని టీటీడీ ఈఓ సాంబశివరావు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఇందుకు కేంద్రం ససేమిరా అన్నది. టీటీడీ ఈఓ లేఖకు సమాధానం కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో నానాటికీ పెరిగిపోతున్న బంగారం నిల్వలను కూడా పాత పద్ధతిలో మాదిరిగానే బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1.3, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో 1.4 టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది.