: పొగ పీల్చుతున్నారా..? అయితే మీ వ‌ల్లే దేశానికి ఏటా రూ.లక్ష కోట్ల నష్టం!


పొగ తాగితే కేన్సర్ వస్తుందని ఇప్పటి వరకు వైద్యుల హెచ్చరికలు వింటున్నాం. ధూమపానం వల్ల మెదడులోని నాడీ కణాలు సైతం దెబ్బతింటాయని తాజాగా ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల ఏటా 30లక్షల మంది చనిపోతున్నారని అంచ‌నా. అయితే, మ‌న దేశం విష‌యానికొస్తే.. ధూమపాన సంబంధ వ్యాధుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.లక్ష కోట్లమేర భారం పడుతున్నట్లు తాజాగా వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డబ్ల్యూహెచ్‌వో) చెప్తోంది. దాదాపు 90శాతం నోటి కేన్సర్ మరణాలు పొగ తాగడం, పొగాకు ప‌దార్థాలు నమలడం వల్లనే సంభవిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తుల వినియోగం ద్వారా ఏటా లక్షల మంది వ్యాధుల బారిన పడుతున్నారని, ఆ వ్యాధుల నివారణ కోసం భారత దేశంపై రూ.1,04,500 కోట్ల ఆర్థిక భారం పడుతున్నదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దాదాపు 10లక్షల ప్రాణాలను ఇది హరిస్తోందని తెలిపింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే హెచ్చరిక సందేశాలు.. పొగాకుతో ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల్లో ప్రజల్లో అవగాహన పెంచడానికి, పొగాకు వినియోగం తగ్గేలా చూడటానికి చౌకైన విధానాలని తెలిపింది. పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం వంటి చ‌ర్య‌ల‌తో కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కేన్సర్, గుండె వ్యాధులు. అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉంది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతోంది.

  • Loading...

More Telugu News