: వాట్ నెక్స్ట్ ... ఇలా జరిగితేనే ఇండియాకు సెమీస్ చాన్స్!


వరల్డ్ కప్ టీ-20 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం పది జట్లు పాల్గొంటున్న టోర్నీలో ఇప్పటివరకూ న్యూజిలాండ్ జట్టు మాత్రమే సెమీస్ అవకాశాలను ఖరారు చేసుకుంది. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. మిగిలిన ఏడు జట్లలో సెమీస్ కు చేరడానికి మూడు జట్లకే అవకాశాలు ఉండటంతో నేటి నుంచి జరిగే పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతాయనడంలో సందేహం లేదు. గ్రూప్-2లో రెండో స్థానం కోసం పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండియా మధ్య పోటీ నెలకొని వుంది. ఇప్పటి వరకూ రెండు మ్యాచ్ లు ఆడి ఒకటి గెలిచిన ఆస్ట్రేలియా, మూడు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్ మధ్య నేడు జరగనున్న పోరు అత్యంత కీలకం. ఈ పోటీలో పాకిస్థాన్ గెలిస్తే, ఇప్పటికే మెరుగైన రన్ రేట్ ఉన్న పాక్ రెండో స్థానంలో నిలుస్తుంది. ఆస్ట్రేలియా గెలిస్తే పాక్ ఇంటికి వెళ్లిపోయినట్టే. అదే జరిగితే, 27న ఆస్ట్రేలియాతో జరిగే పోరులో ఇండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి వుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాక్ గెలిచి, ఆపై భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే ఇండియా టోర్నీ నుంచి తప్పుకున్నట్టే. ఎందుకంటే, ఈ రెండు దేశాల నెట్ రన్ రేట్ ఇండియా కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి. ఎటొచ్చీ రన్ రేట్ అంశం తెరపైకి రాకుండా ఉండాలంటే, భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే. ఇక గ్రూప్ వన్ లో ఏ జట్లు సెమీస్ కు వస్తాయన్నది ఇప్పటికిప్పుడు తేల్చలేని పరిస్థితి. ఎందుకంటే, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడి ఒకటి గెలిచివున్నాయి. ఈ జట్లు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. వెస్టిండీస్ రెండు పోటీల్లో రెండు విజయాలతో ముందంజలో ఉండగా, ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఏదిఏమైనా నేడు జరిగే పాక్ - ఆసీస్ పోరు భారత అభిమానులకు అత్యంత ఆసక్తికరం!

  • Loading...

More Telugu News