: ముద్రగడకు బొండా ఉమ చెక్!... కాపు కీలక నేతలతో నేటి సాయంత్రం కీలక భేటీ
కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు ఇబ్బడి ముబ్బడిగా నిధులు... ప్రధాన డిమాండ్లుగా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్న కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెక్ పెట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మొన్న నిర్వహించిన కాపు ఐక్య గర్జనతో ముద్రగడ పట్ల కాపులకు ఓ స్థాయిలో నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జనం మద్దతు పలికారు. ఇక మరింత దూకుడుగా వ్యవహరించడమే కాక, టీడీపీ సర్కారును ఇరకాటంలోకి నెట్టి డిమాండ్లను సాధించుకునేందుకు ముద్రగడ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో బొండా ఉమ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అందరం కలిసి కూర్చుని చర్చించుకుందాం రమ్మంటూ ఆయన చేసిన ప్రతిపాదనకు కాపుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. నేటి సాయంత్రం విజయవాడలో బొండా ఉమతో 13 జిల్లాల కాపు ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది? ఇకపై ఏం చేయబోతోంది? అన్న అంశాలపై ఆయన కాపు ప్రతినిధులకు వివరించనున్నట్లు సమాచారం.