: ధనార్జనలో దూసుకుపోతున్న కోహ్లీ... ధోనీని వెనక్కు నెట్టిన వైనం!
వరుస విజయాలతో టీమిండియాను టాప్ పొజిషన్ లోకి తీసుకువచ్చిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... ఆర్జనలో క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఎదిగాడు. అయితే చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి అద్భుత ఆటతీరు కనబరుస్తున్న ఢిల్లీ కుర్రాడు విరాట్ కోహ్లీ... ఇప్పటికే ధోనీ నుంచి టెస్టు జట్టు పగ్గాలు చేజిక్కించుకున్నాడు. ఇక ధోనీ రిటైర్ అయితే... వన్డే, టీ20 జట్ల పగ్గాలు కూడా అతడి చేతికే అందనున్నాయి. ఈ క్రమంలో నిలకడతో కూడిన ప్రదర్శనను కనబరుస్తూ వస్తున్న కోహ్లీ... ఆర్జనలోనూ దూసుకొస్తున్నాడు. ఇప్పటికే అతడు ఏడాదికి రూ.100 కోట్లు ఆర్జిస్తున్న క్రికెటర్ల క్లబ్ లోకి ఎంటరైపోయాడని ‘ఈఎస్పీ ప్రాపర్టీస్-స్పోర్ట్స్ పవర్’ అనే సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 13 వ్యాపార సంస్థల వాణిజ్య ప్రకటనల్లో కోహ్లీ కనిపిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ ‘ఆడిదాస్’తో ఒప్పందం ద్వారా ఏడాదికి రూ.10 కోట్లు ఆర్జిస్తున్న కోహ్లీ... తాజాగా ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ తో ఏడాదికి రూ.6.5 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. వీటితో పాటు మరో 11 కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న కోహ్లీ... ఈ ఏడాదిలోనే ఆర్జనలో కెప్టెన్ కూల్ ధోనీని దాటేసిపోతాడని పరిశీలకులు చెబుతున్నారు.