: అప్పుడలా అన్నాను...ఇప్పుడు చెబుతున్నా...రిటైర్మెంట్ లేదు: నాగార్జున
అప్పట్లో పదేళ్ల తరువాత రిటైర్ అవుతానని, అప్పటి పరిస్థితులను బట్టి ప్రకటించానని ప్రముఖ నటుడు నాగార్జున వివరణ ఇచ్చారు. 'ఊపిరి' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో 60 ఏళ్లు వచ్చినా కాలేజ్ కు వెళ్లడాన్ని, డ్యూయెట్లు పాడడాన్ని ప్రేక్షకులు అంగీకరించారని, ఆ తరువాత శోభన్ బాబు, కృష్ణ గారు 50 ఏళ్లు వచ్చేవరకు నటించినా అంగీకరించారని, ఆ తరువాత తరం నటుల నటనా కాలం మరింత తగ్గిందని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అప్పట్లో రిటైర్ అవుదామని భావించానని నాగార్జున చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, కథలను సరిగ్గా ఎంచుకుని, ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఉంటే...నటనలో ఎంత కాలమైనా కొనసాగవచ్చని నిరూపితమవుతోందని అన్నారు. అందుకే రిటైర్మెంట్ ఆలోచన లేదని ఆయన చెప్పారు. చివరి వరకు సినిమాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.