: చంద్రబాబు క్యాబినెట్ లో లోకేశ్ కు బెర్త్?
తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చంద్రబాబు దృష్టిని సారించారని వార్తలు వస్తున్న వేళ, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేష్ కు రాష్ట్ర మంత్రి పదవి లభించవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి లోకేశ్ కు కేంద్ర మంత్రి పదవి రావచ్చని గత కొంత కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు టీడీపీ సీనియర్ నేత ఒకరు తెరదించారు. ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అవలంబిస్తున్న వైఖరి పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, తనయుడిని కేంద్రంలోకి పంపే బదులు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుగుదేశం నేత వెల్లడించినట్టు ఆంగ్ల దినపత్రిక 'డిఎన్ఏ' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా, తెలుగుదేశం కేంద్ర కమిటీలో 2015లో లోకేశ్ కు స్థానం లభించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చూపవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. లోకేశ్ కు పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖను అప్పగించవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ పునర్వ్యవస్థీకరణ జరగని సంగతి తెలిసిందే. లోకేశ్ కోసం తమ ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసేందుకు పలువురు లైన్లో ఉన్నట్టు సమాచారం.