: కివీస్ జాతీయ పతాకంలో మార్పుల్లేవ్... పాత జెండాకే జై కొట్టిన ప్రజలు!
న్యూజిలాండ్ తన జాతీయ పతాకాన్ని మార్చుకోవడానికి చేసిన కసరత్తులు ముగిశాయి. కొత్త నమూనాలను పక్కనపెట్టి 1902 నాటి జెండానే కొనసాగించాలని ఆ దేశం నిర్ణయించింది. తమ జాతీయ పతాకాన్ని మార్చేందుకు న్యూజిలాండ్ ప్రజాభిప్రాయాన్ని నిర్వహించింది, ఈ ప్రక్రియలో 2 మిలియన్ల మంది పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తొలుత చాలా మంది కొత్త జెండాకు మొగ్గు చూపినట్లు కనిపించినా.. ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. జాతీయ జెండా ఎంపికపై ఓటింగ్‌లో కివీస్ ప్రజలు పాత జెండాకే ఓటేశారు. గురువారం వెల్లడించిన ప్రాథమిక ఫలితాల్లో 57 శాతం మంది పాత జెండాకే ఓటేసినట్లు తెలిసింది. న్యూజిలాండ్ తన జాతీయ పతాకాన్ని మార్చుకోవాలనుకోవడానికి ఓ కారణం ఉంది. ఇప్పుడున్న జాతీయ పతాకం, పొరుగు దేశం ఆస్ట్రేలియా జెండాను పోలి ఉంది. అలాగే, బ్రిటిష్ యూనియన్ జాక్ చిహ్నం కూడా అందులో ఉంది. అందుకే, పూర్తిగా తమదైన కొత్త జాతీయ పతాకం ఉండాలనే భావన ఆ దేశ ప్రజల్లో పెరిగింది. దీంతో జెండా మార్చే ప్రక్రియ కొనసాగింది. కానీ, ఓట్లు మాత్రం పాత జెండా వైపే మొగ్గుచూపాయి. దీంతో జెండాలో ఏమార్పులు ఉండబోవని తేలిపోయింది.