: స్మార్ట్‌ఫోన్ ను తెలివిగా ఉపయోగిద్దాం!
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అదో కిక్. వాటిలోని యాప్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ మనకు ఎంత సౌలభ్యంగా ఉంటాయో, అంతే నష్టాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. అతి వద్దు అని పెద్దలు ఏనాడో చెప్పారు. స్మార్ట్‌ఫోన్స్ అతి వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు తీరుతున్నాయోకానీ, మానసికంగా మాత్రం యూజర్లు బలహీనమైపోతారని పరిశోధకులు చెబుతున్నారు. అవసరం ఉన్నదాని కన్నా ఎక్కువగా వాడడం, నిద్రలేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకూ చేతిలో స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేస్తుంటే.. కాస్త జాగ్రత్త వహించండి. అదేపనిగా రోజంతా స్మార్ట్ ఫోన్లలో తలలు దూర్చి తెగ చూస్తుండిపోయేవారిలో సహజంగానే అసహనం, తొందరపాటు అనే అవలక్షణాలు వచ్చేస్తాయట. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో దాదాపు 74 శాతం మంది నిద్రపోతున్న సమయంలోనూ వారి ఫోన్లను వదలడం లేదని ఓ సర్వేలో తేలింది. బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీగా దొరికింది కదా అని ఏ వై-ఫై నెట్‌వర్క్ దొరికితే దాన్ని ఉపయోగించుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లు పరోక్షంగా వేరొకరి చేతిలోకి వెళ్లిపోయే ‘డెండ్రాయిడ్’ అనే కొత్త వైరస్ మన దేశంలో వ్యాపిస్తోందట. స్మార్ట్ ఫోన్‌లను తెలివిగా వినియోగించుకునే వారూ ఉన్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, హెయిర్ కటింగ్ దగ్గర నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వరకూ ఉచితంగా పొందే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. వ్యక్తిగత రక్షణకు సాయపడే హ్యాక్‌ఐ లాంటివి అమ్మాయిలకు అత్యవసర పరిస్థితుల్లో తోడుగా ఉంటాయి. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి అనేక యాప్‌లు లభ్యమవుతోన్న విషయం తెలిసిందే. ఇవే కాదు, ఇంకా చాలా రకాల యాప్స్‌ని ఉపయోగిస్తూ అనేక ప్రయోజనాలను పొందేవారూ ఉన్నారు. అతిగా ఉపయోగించకుండా మితంగా, తెలివిగా ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలు పొందుతాం. లేదంటే వాటికి దాసోహమై కష్టాలు కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం.