: ముస్లిం చట్టాలు సుప్రీంకోర్టుకు అతీతం... ఏమీ చేయలేరంటున్న లా బోర్డు
ఖురాన్ లో సూచించిన విధంగా ఉన్న ముస్లిం పర్సనల్ లా బోర్డును సుప్రీంకోర్టు మార్చజాలదని, దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలోకి తమ చట్టాలు రావని ఏఐఎంపీఎల్బీ (ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు) వ్యాఖ్యానించింది. మూడు సార్లు 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు తీసుకోవచ్చని ముస్లిం చట్టంలో ఉండటాన్ని మరోసారి సమీక్షించాలని సుప్రీంకోర్టు సుమోటోగా నిర్ణయం తీసుకోవడాన్ని ముస్లిం లా బోర్డు ఆక్షేపించింది. పార్లమెంటు సైతం తమ చట్టాలను మార్చలేవని అభిప్రాయపడింది. హిందూ కోడ్ బిల్ అమలు చేస్తున్నంత మాత్రాన కులాల మధ్య అంతరాలు తొలగలేదని ప్రస్తావించిన ఏఐఎంపీఎల్బీ, పవిత్ర ఖురాన్ ప్రకారమే తమ చట్టాలుంటాయని తెలుపుతూ, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది.