: రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్మిన మోహన్ బాబు!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్మారు. ఆయనిలా ఇడ్లీలు అమ్మింది ఏదో సినిమా షూటింగ్ కోసం కాదు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం ఆయన ఇడ్లీలు అమ్మాల్సి వచ్చింది. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఎదురుగా రోడ్డు మీద మోహన్ బాబు ఇడ్లీలు అమ్మారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను ‘మేము సైతం’ ద్వారా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ విషయాన్ని శ్రీ విద్యానికేతన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ట్విట్టర్ లో పోస్టు చేసింది. కాగా, గతంలో ‘మేము సైతం’ కార్యక్రమానికి సహాయం నిమిత్తం సినీ నటులు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రానా, అఖిల్ అక్కినేని తదితరులు తమ వంతు సాయం చేశారు.