: విజయవాడకు మారిన 'కన్నయ్య' సీన్... అక్కడ కూడా హై టెన్షన్ వాతావరణం!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్నయ్య తెలుగు రాష్ట్రాల పర్యటన వివాదాల మధ్య సాగుతోంది. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చి, రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన ఆయన, నేడు విజయవాడ చేరుకున్నాడు. ఆయన్ను విజయవాడకు రానిచ్చేది లేదని బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా), ఏబీవీపీ నాయకులు హెచ్చరించగా, ఎక్కడ కన్నయ్యను అడ్డుకున్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వామపక్ష నేతలు ప్రతి హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్నయ్య సభ జరిపి తీరుతామని వెల్లడించిన సీపీఐ, సీపీఎం నేతలు, గవర్నర్ పేటలోని ఐవీ ప్యాలెస్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు, తమను ఎవరూ సభకు అనుమతి కోరలేదని తెలిపారు. ఉద్రిక్తతలు పెరగకుండా కన్నయ్యను ముందుగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.