: ఆద్యంతం ఉత్కంఠ!...చివరి బంతికి టీమిండియా విజయం
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో నిన్న మరో హైటెన్షన్ మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను టీవీల ముందు కట్టిపడేసింది. టోర్నీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం టీమిండియానే వరించినా, టెన్షన్ మాత్రం చివరి బంతిదాకా కొనసాగింది. విజేతను నిర్దేశించిన చివరి ఓవర్ లో బంతి బంతికి టెన్షన్ పెరిగిపోయింది. టీమిండియా కొత్త కుర్రాడు హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ లో బంగ్లాదేశ్ దాదాపుగా నెగ్గేస్తుందనుకున్నారు. అయితే పాండ్యా తన చివరి మూడు బంతులతో మ్యాజిక్ చేశాడు. తొలి, రెండో బంతులకు రెండు వికెట్లు తీసిన పాండ్యా... చివరి బంతికి ఓ పరుగు ఇచ్చినంత పనిచేశాడు. అయితే కెప్టెన్ ధోని బంతిని ఒడిసిపట్టుకోవడమే కాక క్రీజులోకి బ్యాట్స్ మన్ రాకముందే వికెట్లను పడగొట్టాడు. దీంతో వరుసగా మూడో బంతికి కూడా మరో వికెట్ పడింది. పరుగు మాత్రం బంగ్లా ఖాతాలో చేరలేదు. వెరసి బంగ్లాపై హాట్ ఫేవరెట్ ధోనీ సేన చెమటోడ్చి ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు స్టాండ్స్ లోని ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న క్రికెట్ లవర్స్ ను ఇట్టే కట్టిపడేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ధోనీ సేన 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఆ తర్వాత 147 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు చేజార్చుకుని 145 పరుగులే చేయగలిగింది. దీంతో ధోనీ సేన సింగిల్ పరుగు తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. బంగ్లాకు 11 పరుగులు కావాల్సిన తరుణంలో చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా... మూడు బంతుల్లోనే 9 పరుగులిచ్చేసి చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు.