: ఉద్యోగులకు కేంద్రం హోలీ కానుక... 6 శాతం పెరిగిన డీఏ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు హోలీ కానుక ప్రకటించింది. కరవు భత్యాన్ని (డీఏ - డియర్ నెస్ అలవెన్స్) 6 శాతం మేరకు పెంచుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులకు అందుతున్న డీఏ ప్రస్తుతమున్న 119 శాతం నుంచి 125 శాతానికి పెరిగినట్లయింది. డీఏ పెంపుతో సాలీనా రూ. 14,724.74 కోట్ల భారం కేంద్ర ఖజానాపై పడనుండగా, కోటి మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇండియాలో 48 లక్షల మంది ఉద్యోగులు వివిధ కేంద్ర సంస్థల్లో విధులు నిర్వహిస్తుండగా, 55 లక్షల మంది కేంద్రం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో 'అందరికీ ఇల్లు' నినాదంతో అభివృద్ధి దిశగా సాగేలా గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల గృహాల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.