: జగన్ తో సెల్ఫీలు దిగి బాబు దగ్గర బుక్కయిన ఐఏఎస్ లు!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన విమానంలో ఉన్న ఏపీ కి చెందిన ఐఏఎస్ అధికారులు ఆయనతో సెల్ఫీలు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఈ సంఘటన వివరాలన్నింటినీ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పూసగుచ్చినట్లుగా తెలిసిపోయిందని సమాచారం. దీంతో సదరు ఐఏఎస్ లు కొంచెం కంగారుపడుతున్నట్లు సమాచారం. జగన్ తో ఐఏఎస్ ల సెల్ఫీల కథేమిటంటే.. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక ప్రభుత్వ సమావేశానికి ఐఏఎస్ అధికారులు వెళ్లాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రేణిగుంటకు వెళ్లే విమానాన్ని సదరు ఐఏఎస్ లు ఎక్కి కూర్చున్నారు. మరి కొన్ని నిమిషాల్లో విమానం బయలుదేరుతుందనగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విమానంలోకి ఎక్కి, ముందు వరుస సీట్లో కూర్చున్నారు. జగన్ వచ్చిన విషయాన్ని గమనించిన ఐఏఎస్ లు ప్రొటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా ప్రతిపక్షనేతను పలుకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన అనంతరం కొంతమంది ఐఏఎస్ లు తమ సీట్లలో కూర్చున్నారు. కానీ, మరి కొంతమంది ఐఏఎస్ లు మాత్రం మరింత ఉత్సాహం చూపించారు. జగన్ తో సెల్ఫీలు దిగారు. కట్ చేస్తే, విమానం బయలుదేరింది. రేణిగుంటలో ల్యాండ్ అయింది. ఇంతలో అదే విమానంలో ఉన్న ఇద్దరు క్యాబినెట్ మంత్రులు తాపీగా లేచి నిలబడ్డారు. దీంతో, సెల్ఫీలు దిగిన ఐఏఎస్ లు కంగుతిన్నారు. ఈ సెల్ఫీల తతంగాన్ని, జగన్ తో మాట్లాడిన ఐఏఎస్ లను ఈ ఇద్దరు మంత్రులు గమనిస్తూ కూర్చున్నారట. విమానంలో మంత్రులు ఉన్న విషయాన్ని సైతం కొంతమంది ఐఏఎస్ లు గుర్తించలేదట. విమానం దిగిన తర్వాత మంత్రుల కాన్వాయ్ రావడంతో, వారెవరని ఆరా తీసిన సదరు ఐఏఎస్ లకు అప్పడు అర్థమైందట. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో సదరు ఐఏఎస్ లు బెంబేలెత్తుతున్నట్లు సమాచారం.