: మీ భార్యలు కూడా మీ వెంటరారు: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జగన్ చురకలు
"ఏ నాయకుడికైనా వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి. రాజకీయాల్లో రోల్ మోడల్ గా ఉండాలే తప్ప, ప్రజలు అసహ్యించుకునేలా ఉండకూడదు. చంద్రబాబు సహా పార్టీలు మారిన వారందరికీ ఇదే వర్తిస్తుంది. నీతి, నిజాయతీలు లేకుంటే కట్టుకున్న భార్య కూడా వెంట నడిచే పరిస్థితి ఉండదు" అని వైకాపా నేత వైఎస్ జగన్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చురకలంటించారు. ఈ మధ్యాహ్నం నెల్లూరులో జరిగిన సభలో పాల్గొన్న ఆయన, సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తిత్వం చంద్రబాబుదని, ప్రజలకు అబద్ధాలు చెప్పి, వారిని మోసం చేయడమే ఆయనకున్న విశ్వసనీయతని ఎద్దేవా చేశారు. ఇవి లేని చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం తనకు అనవసరమని అన్నారు. ఎన్నికలకు ముందు చేసిన తప్పుడు హామీలతో రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను గాలికి వదిలేసిన ఆయనకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.