: మోదీ సర్కారు 'హార్స్ ట్రేడింగ్'... ప్రణబ్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు 'హార్స్ ట్రేడింగ్'కు పాల్పడుతూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆ పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ అలజడి సృష్టిస్తోందని ఆరోపించారు. "బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ఏకపక్ష, కఠోర నిర్ణయాలను తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేలా పన్నాగాలు పన్నుతోంది. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని చూస్తోంది. ఈ తరహా చర్యలను మీరు అడ్డుకోవాలి" అని ఓ మెమొరాండంను ఆ పార్టీ నేతలు గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, అహ్మద్ పటేల్, కపిల్ సిబాల్ తదితరులు రాష్ట్రపతికి అందించారు. "విపక్షం పాలిస్తున్న రాష్ట్రాలపై బీజేపీ కుయుక్తులు పన్నుతోంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి మేం ఫిర్యాదు చేశాం. మా ఎమ్మెల్యేలను బలవంతంగా బస్సులు ఎక్కించి ఉత్తరాఖండ్ గవర్నర్ ముందుకు తీసుకెళ్లారు. వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వినకుంటే బెదిరిస్తున్నారు" అని రాష్ట్రపతితో సమావేశం అనంతరం గులాం నబీ ఆజాద్ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గవర్నర్లపై బీజేపీ ఒత్తిడి పెడుతోందని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన మెజారిటీని నిరూపించుకుంటారన్న నమ్మకముందని ఆయన అన్నారు.