: పోలీసుల చక్రబంధంలో హెచ్ సీయూ... గేటు వద్దే వీహెచ్, మీడియా అడ్డగింత


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో నిప్పుల కుంపటిలా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ)లో మరోమారు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ పొదిలె అప్పారావు సుదీర్ఘ సెలవులో వెళ్లి ఉన్నట్టుండి నిన్న వర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. అంతేకాక ఇన్ చార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు భగ్గుమన్నారు. నిన్న వర్సిటీలో ధ్వంస రచనకు పాల్పడ్డారు. మరోవైపు తన కుమారుడి మరణానికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ వేముల తల్లి నేడు వర్సిటీలో దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నయ్య కుమార్ నేడు హైదరాబాదు వస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న అనుమానంతో పోలీసులు కన్నయ్య ప్రవేశాన్ని అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కన్నయ్య వస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం వర్సిటీకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు (వీహెచ్)ను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. వర్సిటీకి చెందిన విద్యార్థులను మినహా ఏ ఒక్కరిని లోపలికి అనుమతించేది లేదని చెబుతున్న పోలీసులు చివరకు మీడియాను కూడా గేటు బయటే నిలబెట్టారు. వర్సిటీ అన్ని గేట్లను మూసేసిన పోలీసులు వర్సిటీని దాదాపుగా తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో అసలు లోపల ఏం జరుగుతున్నదన్న విషయం తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News