: పారిశుద్ధ్య భార‌తావ‌నే ల‌క్ష్యంగా కిలిమంజారో ప‌ర్వ‌తారోహ‌ణ


విద్యార్థుల ప్ర‌గ‌తితో దేశ‌భ‌విత‌కు బీజం ప‌డేది పాఠ‌శాల‌ల్లోనే. అయితే అక్క‌డి పారిశుద్ధ్య ప‌రిస్థితులు అధ్వానంగా ఉండ‌డం మ‌న‌కు త‌రుచుగా క‌నిపించే దృశ్యంగా ఏళ్ల‌త‌ర‌బ‌డి కొన‌సాగుతోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడం వ‌ల్ల‌ చాలా మంది బాలికలు చదువు మానేస్తున్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య‌ పరిస్థితులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ఈ ప‌రిస్థితుల నిర్మూల‌నే ల‌క్ష్యంగా.. పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాల‌ను చ‌క్క‌దిద్దే ఆశ‌యంతో ఇండో కెనడియన్ వ్యాపారవేత్త గిరీష్ అగర్వాల్ ఫిబ్రవరి 29న ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ఎక్కి రూ. 40 లక్షల నిధులు సేకరించాడు. అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నం చేసి 5900 మీటర్ల ఎత్తైన పర్వతం కిలిమంజారో అధిరోహించాడు. అంతేకాదు ఒక్కో పర్వతం ఒక్కోసారి ఎక్కి తన కల నెలవేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. త‌ద్వారా తాను అనుకున్న పారిశుద్ధ్య భార‌తావ‌ని వైపు త‌న ల‌క్ష్యాన్ని కొన‌సాగిస్తున్నాడు. ముంబైలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన అగర్వాల్ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడి వ్యాపారవేత్తల్లో టాప్ 25 గా నిలవడమే కాక, కెనడా వలస పెట్టుబడిదారుల గ్రూప్ గోల్డ్ మెడలిస్ట్ అవార్డును కూడా అందుకున్నాడు. పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాల‌కు ఆర్థిక వెసులుబాటు క‌ల్పించ‌డానికి గిరీష్ అగర్వాల్ పర్వతారోహణ ప్రారంభించాడు. ఈ విష‌యంపై పాఠశాల పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన క‌ల్పిస్తూ 'సమిట్ ఫర్ డిగ్నిటీ పేరున' ప్రచారం చేపట్టారు. ఇప్ప‌టికే వివిధ దేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వీలుగా అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌తో అగ‌ర్వాల్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

  • Loading...

More Telugu News