: పఠాన్ కోట్ లో తుపాకి గురి పెట్టి కారు అపహరణ... ముమ్మర సోదాలు!
మొన్నటి ఉగ్రదాడి నుంచి పూర్తిగా కోలుకోక ముందే పఠాన్ కోట్ మరోసారి ఉలిక్కిపడింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారును ముగ్గురు దుండగులు అడ్డుకుని తుపాకితో బెదిరించి కారును ఎత్తుకెళ్లిన ఘటన భద్రతా దళాలకు మరో పని పెట్టింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పఠాన్ కోట్ - జమ్మూ జాతీయ రహదారిపై రాత్రి 7 గంటల సమయంలో ఓ వ్యక్తి తన కారులో వస్తుండగా, ఓ వ్యక్తి లిఫ్ట్ కోసం అన్నట్టు కారును ఆపాడు. ఆగిన కారులోని వ్యక్తికి తుపాకీ చూపి బెదిరించి, తనతో ఉన్న మరో ఇద్దరు సహా పారిపోయాడు. కారు అపహరణకు కారణం ఉగ్రవాదులు కారని భావిస్తున్నట్టు వెల్లడించిన పోలీసులు, దుండగులను పట్టుకునేందుకు అన్ని చెక్ పోస్టుల వద్దా సోదాలను ముమ్మరం చేసినట్టు తెలిపారు.