: సెమీస్ కు న్యూజిలాండ్ కన్ఫార్మ్... భారత్, పాక్, అసీస్, బంగ్లా... ఎవరికి ఎంత చాన్సంటే..!
టీ-20 వరల్డ్ కప్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. సూపర్ లీగ్ లో గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ జట్టు సెమీస్ కు చేరుకుంది. మిగిలిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్ జట్ల నుంచి మరొక్క జట్టుకు మాత్రమే అవకాశం ఉంది. ఈ గ్రూప్ లో ఆసీస్, ఇండియా, బంగ్లాదేశ్ జట్లు రెండేసి మ్యాచ్ లను ఆడాల్సి వుండగా, న్యూజిలాండ్, పాక్ జట్లు ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. నేడు భారత జట్టు బంగ్లాదేశ్ ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ ఇండియాకు అత్యంత కీలకం. సొంతగడ్డ, బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్ కు అనుకూలం కాగా, పొట్టి క్రికెట్లో సంచలనాలు చేయగల సత్తా బంగ్లాకుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే ఇండియాకు సెమీస్ చాన్సులు మెరుగుపడటంతో పాటు బంగ్లా జట్టు ఇంటికి వెళుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే, ఇండియా తదుపరి పోటీల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. బంగ్లాదేశ్, తన చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచి సెమీస్ అవకాశాల కోసం ఇతర ఫలితాలు చూస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేటి పోరు మనకన్నా, బంగ్లాకు ఎంతో ముఖ్యం. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే, న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు, బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఈ జట్టు తదుపరి ఇండియా, పాకిస్థాన్ లతో ఆడాల్సి వుంది. శుక్రవారం నాడు ఆస్ట్రేలియా, పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ ఈ రెండు దేశాలకూ కీలకం. లీగ్ లో చెరో విజయం సాధించిన ఈ రెండు దేశాల మధ్యా పోరు తరువాత ఓడిన దేశం ఇంటికెళ్లిపోతుంది. గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మిగిలుంటాయి. ఇక్కడ నెట్ రన్ రేట్ అత్యంత కీలకం. కనీసం ఒక జట్టు మూడు మ్యాచ్ లను గెలుచుకోలేక పోతే, ఇండియా, పాకిస్థాన్, ఆసీస్ జట్లు తలా రెండు విజయాలతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది. అది భారత్ కు కొంత ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే, పాక్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే మన రన్ రేట్ మైనస్ లో ఉంది కాబట్టి. దీన్ని మెరుగుపరచుకోవాలంటే, నేటి బంగ్లాదేశ్ పై భారీ తేడాతో విజయం సాధించాల్సి వుంటుంది. తొలుత బ్యాటింగ్ చేసి, 46 పరుగుల తేడాతో ఇండియా గెలిస్తేనే రన్ రేట్ పాజిటివ్ కు వస్తుంది. ఇంకా మరింత తేడాను చూపగలిగితేనే పాక్ ను అధిగమిస్తుంది. ఇలా గ్రూప్ 2లోని దేశాల మధ్య పోటీలు ఆసక్తికరంగా సాగుతుండగా, గ్రూప్ 1లో ఇంకా ఏ దేశానికీ సెమీస్ అవకాశాలు కన్ఫర్మ్ కాలేదు. వెస్టిండీస్ జట్టు తానాడిన రెండు మ్యాచ్ లలో నెగ్గి 4 పాయింట్లతో ముందుండగా, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్ దేశాలు తలా ఒక విజయంతో ఉన్నాయి. ఆఫ్గన్ రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది. దీంతో గ్రూప్-1 నుంచి ఏ రెండు దేశాలైనా సెమీస్ కు రావచ్చు.