: డేంజర్ బెల్స్ మోగించిన ఎమ్మెల్యేలు... అంత ప్రమాదమేమీ లేదన్న జగన్


ఏపీ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ పదవికి తొలిసారి సభలో అడుగుపెట్టిన కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద చర్చకే తెరతీశారు. గతంలో ఎన్నడూ కొత్తగా సభకు ఎన్నికైన ఎమ్మెల్యే ఆ పదవి చేపట్టలేదు. ప్రతిసారీ సీనియర్లకే ఆ పదవి దక్కింది. అయితే గణాంకాలు బాగా తెలియడమే కాక వాగ్ధాటి కలిగిన నేతకు పదవి ఇచ్చానని, ఇదేమీ అంత ఇబ్బంది కలిగించే విషయమేమీ కాదని జగన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఈ పదవిని ఆశించిన వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాథ్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలు.. జగన్ నిర్ణయంతో షాక్ తిన్నారు. అమర్ నాథ్ రెడ్డి నిరసన గళం విప్పారు కూడా. అయితే జ్యోతుల తన హుందాతనాన్ని కాపాడుకుంటూ కాస్తంత ముభావంగా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి దీనిపై ఆసక్తికర కామెంట్లు చేసి తనకు పదవి రాకపోయినా ఇబ్బందేమీ లేదని తేల్చేశారు. పెద్దిరెడ్డిని పక్కనబెడితే... మిగిలిన ఇద్దరు సీనియర్లు జ్యోతుల, అమర్ నాథ్ రెడ్డిలు పార్టీ వీడితే... పరిస్థితి ఏమిటంటూ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు ఆయన వద్ద డేంజర్ బెల్స్ మోగించారట. ‘‘అన్నా... పీఏసీ చైర్మన్ ఎంపిక విషయంలో పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. జ్యోతుల నెహ్రూ, అమర్ నాథ్ రెడ్డి పార్టీకి దూరమైతే చాలా నష్టం జరుగుతుంది’’ అని పేర్కొన్నారట. అయితే, వారి వాదనతో విభేదించిన జగన్... తన నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నట్లు సమాచారం. ‘‘పీఏసీ చైర్మన్ గా లెక్కలు తెలిసిన, సరైన, సమర్ధుడైన వ్యక్తి కావాలి. ఈ విషయాన్ని నేను నెహ్రూతోనూ చెప్పాను. రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చినా ఫర్వాలేదని నెహ్రూ కూడా అంగీకరించారు. ఇక ఇందులో తప్పేముంది?’’ అని జగన్ వారిని ఎదురు ప్రశ్నించారట.

  • Loading...

More Telugu News