: వైసీపీ నేతను ఆకాశానికెత్తేసిన టీడీపీ నేత!
నమ్మశక్యం కాకున్నా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఆ టీడీపీ నేత ఈ మాటలన్నది ఎక్కడో అంతర్గత సమావేశాల్లో కాదు. అసెంబ్లీ లాబీల్లో మీడియా సాక్షిగా అన్న మాటలవి. అయినా ఆ వైసీపీ నేత, ఈ టీడీపీ నేతలెవరనేగా మీ ప్రశ్న? అక్కడికే వస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప... తన సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత, అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూను ఆకాశానికెత్తేశారు. పీఏసీ చైర్మన్ పదవికి జ్యోతులను కాకుండా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై నిన్న అసెంబ్లీ లాబీల్లో భాగంగా జ్యోతులకు పలువురు టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జ్యోతుల కూడా టీడీపీలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జ్యోతుల వైసీపీ గూటికి చేరారు. కీలక నేతగా ఎదిగారు. జ్యోతుల వైసీపీలో చేరకుండా టీడీపీలోనే ఉండి ఉంటే... పరిస్థితి ఎలా ఉండేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు చినరాజప్ప ఏమన్నారంటే... ‘‘నా పదవి వాస్తవానికి నెహ్రూదే. ఆయన పార్టీలో లేకపోవడం వల్లే నాకు పదవి వచ్చింది. ప్రజలకు మంచి చేయాలన్న మాటను నమ్మి నెహ్రూ రాజకీయాలు చేస్తున్నారు’’ అని జ్యోతుల వ్యక్తిత్వాన్ని చినరాజప్ప పొగిడారు.