: రాణించిన కివీస్ ఆటగాళ్లు... పాక్ లక్ష్యం 181
మొహాలీ వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్ లో అండర్ డాగ్ గా బరిలో దిగిన కివీస్ జట్టు ఛాంపియన్ రీతిలో ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కు ఓపెనర్లు గుప్తిల్ (80) విలియమ్సన్ (17) శుభారంభం ఇచ్చారు. అనంతరం మున్రో (7) విఫలమయ్యాడు. సహచరులు వెనుదిరుగుతున్నప్పటికీ గుప్తిల్ జోరు తగ్గలేదు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ చేసి వెనుదిరిగాడు. కోరె ఆండర్సన్ (21) ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. రాస్ టేలర్ (36) చివర్లో మెరుపులు మెరిపించగా, రోంచీ (11) త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో టేలర్ తో పాటు ఇలియట్ (1) నాటౌట్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ షమి చెరో రెండు వికెట్లతో రాణించగా, మహ్మద్ ఇర్ఫాన్ ఒక వికెట్ తీసి వారికి సహకరించాడు. 181 పరుగుల విజయ లక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.