: అమానుషంగా ప్రవర్తించిన మహిళ...8 కుక్కపిల్లలను హతమార్చిన వైనం


ఎనిమిది కుక్క పిల్లలు మృతి చెందడానికి కారణమైన ఒక మహిళను బెంగళూరు పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారి హరీష్ కేబీ తెలిపారు. ఈనెల 15వ తేదీన నార్త్-వెస్ట్ బెంగళూరులోని జలహలి వెస్ట్ ప్రాంతంలో టమ్కురు రోడ్డు లోని కృష్ణానగర్ లో పొన్నమ్మ కుటుంబం నివసిస్తుంది. పొన్నమ్మ భర్త మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్. ఇటీవల ఒకరోజున ఆమె ఇంటి ముందున్న డ్రెయిన్ వద్ద సమీపంలో పదిహేను రోజుల వయస్సు ఉన్న 8 కుక్క పిల్లలు పడుకుని ఉన్నాయి. కుక్క పిల్లలంటే ఇష్టపడని పొన్నమ్మ వాటిని నేలకేసి బాది, ఆ తర్వాత వాటిని దూరంగా విసిరేసింది. దాంతో ఏడు కుక్కపిల్లలు అక్కడికక్కడే చనిపోగా, మరోటి మాత్రం ఆ మర్నాడు ప్రాణాలు కోల్పోయింది. కాగా, తన పిల్లల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్న నాలుగేళ్ల తల్లి కుక్క (అమ్ము)కు వాటి ఆచూకీ తెలిసింది. అయితే, అవి చనిపోయి ఉండటం చూసిన తల్లికుక్క మూలుగుతూ, పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ అటూఇటూ తిరిగింది. కాగా, ఈ సంఘటనపై ఈనెల 17న పొన్నమ్మ పొరుగు ఇళ్ల వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హరీష్ తెలిపారు. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారని సదరు మహిళను ప్రశ్నించగా, అందుకు ఆమె చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కల్గించిందన్నారు. కుక్క పిల్లల తల్లికి గుణపాఠం నేర్పాలనుకున్నానని, అందుకే, ఆ కుక్క పిల్లలను చంపేశానంటూ ఆమె సమాధానం చెప్పిందన్నారు. అరెస్టయిన ఆమెను బెయిల్ పై విడుదల చేశారు. ఈ దారుణ సంఘటనపై జంతు ప్రేమికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News