: ఏపీ అసెంబ్లీ శనివారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారానికి వాయిదా పడింది. నేడు జరిగిన శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలసంరక్షణపై ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం చేపడుతున్న నీటి ప్రాజెక్టుల గురించి సీఎం సభకు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనానికి శుద్ధజలం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. భూమిపై పడే ప్రతి బొట్టు నీటిని సంరక్షించుకునే దిశలో అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రంలో జలవనరులు కళకళలాడేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మనిషి తప్పిదాలే నీటివనరులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. అనంతరం హోలీ, గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకుని శాసనసభను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.