: అబ్దెస్లామ్ అరెస్ట్ కు ప్రతీకారంగానే బ్రస్సెల్స్ దాడి?... బెల్జియం వ్యాప్తంగా హైఅలర్ట్
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది సలాహ్ అబ్దెస్లామ్ కోసం పలు దేశాల పోలీసులు నెలల తరబడి సాగించిన వేట బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ముగిసింది. గత వారం బ్రస్సెల్స్ లోని ఓ రహస్య స్థావరంలో తలదాచుకున్న అబ్దెస్లామ్ ను చుట్టుముట్టిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ సందర్భంగా బెల్జియం పోలీసులతో అబ్దెస్లామ్ ఓ రేంజిలో పోరాడట. అయితే అప్పటికే పూర్తి స్థాయి సరంజామాతో అతడిపై దాడికి దిగిన సాయుధ బలగాలు అతడి ఆటలకు చెక్ పెట్టాయి. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్ వద్ద రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పలువురు మృత్యువాతపడినట్లు కూడా తెలుస్తోంది. అబ్దెస్లామ్ అరెస్టైన రోజుల వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో... అతడికి చెందిన ఉగ్రవాద సంస్థనే ఈ దాడులకు పాల్పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లు జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బెల్జియం వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టును సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.