: సుప్రీం గడప తొక్కుతాం... విజయం మాదే!: వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడి సంచలన ప్రకటన
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు షాకిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులోని డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు నేపథ్యంలో ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘సుప్రీంకోర్టు గడప తొక్కడం ఖాయం. కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని ఆయన ఉద్ఘాటించారు. డివిజన్ బెంచ్ తీర్పు కాపీ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేవలం నిబంధనలనే మేలి ముసుగు వేసుకుని తమ పార్టీ ఎమ్మెల్యే హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు.