: జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు!... పీఏసీ చైర్మన్ ఎంపికపై నిరసన!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన సొంత పార్టీలోనే మరో నిరసన గళం వినిపించింది. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాథ్ రెడ్డి పార్టీ అధినేత నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెను దుమారం రేపనున్నాయి. నంద్యాల అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించిన భూమా నాగిరెడ్డిని జగన్ పీఏసీ చైర్మన్ గా నియమించారు. అయితే భూమా పీఏసీ చైర్మన్ గిరీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో ఖాళీ అయిన పీఏసీ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అమర్ నాథ్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ యత్నించారు. అయితే నిన్నటి వైసీఎల్పీ సమావేశంలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి పేరును ఆ పదవికి ఎంపిక చేస్తూ జగన్ ప్రకటన చేశారు. దీనిపై కాసేపటి క్రితం అమర్ నాథ్ రెడ్డి నిరసన గళం వినిపించారు. తనకు పదవి రాలేదన్న విషయాన్ని అంతగా ప్రస్తావించని ఆయన... కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతులకు పీఏసీ చైర్మన్ పదవి వస్తుందని భావించామన్నారు. అయితే ఏ ఒక్కరితో చర్చించకుండానే జగన్... రాజేంద్రనాథ్ రెడ్డి పేరును ప్రకటించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు తెలివి కలిగిన వారని అందరూ అనుకుంటారని, అయితే ఆ జిల్లాకు చెందిన నేతలే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News