: హెచ్ సీయూలో విద్యార్థులకు రక్త గాయాలు!... వీసీ బంగ్లాలో ఆరెస్సెస్ గూండాలు ఉన్నారంటూ విద్యార్థుల ఆరోపణ
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రణరంగం చోటుచేసుకుంది. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు సుదీర్ఘ సెలవు ముగించుకుని నేటి ఉదయం వర్సిటీకి వచ్చారు. ఇన్ చార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి ఆయన చార్జీ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు భగ్గుమన్నారు. ఆందోళనకు దిగారు. దీనిపై సమాచారం తెలిసిన వెంటనే పలు మీడియా సంస్థల ప్రతినిధులు అక్కడికి పరుగులు తీశారు. మీడియా వర్సిటీలోకి ఎంటర్ కాగానే... రక్తమోడుతున్న గాయాలతో ఇద్దరు విద్యార్థులు కనిపించారు. ఓ విద్యార్థికి చేతులకు గాయాలు కాగా, దుస్తులకు రక్తం అంటుకున్న వైనం కనిపించింది. కిందపడిపోయిన మరో విద్యార్థి కాలికి గాయమైంది. వర్సిటీలోకి ఎంటరైన వెంటనే వీసీ అప్పారావు... ఏబీవీపీకి చెందిన కొందరు నేతలు, ఆరెస్సెస్ కు చెందిన నేతలు, ఆ భావజాలమున్న అధ్యాపకులతో భేటీ అయ్యారని విద్యార్థులు ఆరోపించారు. వీసీ చాంబర్ లో ఆరెస్సెస్ గూండాలు ఉన్నారని వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లోనే తమకు గాయాలయ్యాయని తెలిపారు. రాళ్లతో జరిగిన ఈ దాడికి వీసీదే బాధ్యత అని ఆరోపించారు. తాజా ఘటనతో హెచ్ సీయూలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.