: యూపీలో బీజేపీ మహిళా నేత అరెస్ట్!... రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణం


ఆగ్రాలో బీజేపీ మహిళా నేత కుందానిక శర్మను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత అరుణ్ మహౌర్ కు సంతాపం తెలిపేందుకు నిర్వహించిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆమెకు వచ్చే నెల 2 దాకా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అరుణ్ మహౌర్ ను ఇటీవలే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో జరిగిన సంతాప సభలో శర్మ ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఆగ్రా కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శర్మకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివచ్చిన అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించారు. బీజేపీ కార్యకర్తల నినాదాలు, పోలీసుల మోహరింపుతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News