: అర్ధ సెంచరీతో రాణించిన ఖ్వాజా...బంగ్లా ఫీల్డింగ్ పూర్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆకట్టుకున్నారు. బంగ్లా జట్టు నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యసాధనలో ఆసీస్ ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ తప్పిదాలతో ఆసీస్ ఆటగాళ్లకు స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించే అవకాశం ఇచ్చారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చేయాల్సిన బంగ్లా ఫీల్డర్లు పలు సందర్భాల్లో బంతిని పట్టుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో అదనపు పరుగులు సమర్పించుకున్నారు. వాట్సన్ గాల్లోకి లేపిన బంతిని మిథున్ వదిలేసి జీవదానం చేశాడు. దీంతో బంగ్లా పెను తప్పిదం చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతలో లేనిపరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్ (21) రన్ అవుట్ గా వెనుదిరిగాడు. మరోపక్క ధాటిగా ఆడిన మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 82 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు.