: కేజ్రీవాల్ కు అరుదైన గౌరవం, ‘తుస్సాడ్స్’లో త్వరలో విగ్రహం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ అంగీకరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసే నిమిత్తం కొలతలు తీసుకునేందుకు వచ్చే నెలలో సంబంధిత అధికారులు రానున్నారని, అందుకు కేజ్రీవాల్ అంగీకరించారని సమాచారం. కాగా, ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఏర్పాటు నిమిత్తం ‘తుస్సాడ్స్’ అధికారులు ఆయన కొలతలు తీసుకువెళ్లారు. ఈ మ్యూజియంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రముఖులకు సంబంధించిన మైనపు విగ్రహాలను మాత్రమే మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం లో ఏర్పాటు చేస్తారు. ‘తుస్సాడ్స్’ కు సింగపూర్, హాంగ్ కాంగ్, బ్యాంకాక్ లో బ్రాంచ్ లు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ మ్యూజియం కొత్త బ్రాంచ్ ను మన దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.