: టీ-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపునకు సిఫారసు
టీ-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు పెంపునకు శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ సిఫారసు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఆయా పార్టీల శాసనసభా పక్షనేతలు పాల్గొన్నారు. ఢిల్లీ, జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇచ్చే సౌకర్యాలను పరిశీలించాలని, అవే మాదిరి సౌకర్యాలను ఇక్కడ కూడా అమలు చేయాలని కమిటీ కోరినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు రూ.1.25 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు, వాహన రుణాన్ని రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని, పరిమితి లేని వైద్య సౌకర్యం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. అంతేకాకుండా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెంచాలని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల మరణానంతరం వారి భార్యలకు కూడా ఇవే సౌకర్యాలు కల్పించాలని ఆ కమిటీ సూచించింది. ఆదర్శ్ నగర్ లో ఎమ్మెల్యే క్వార్టర్ల పనుల ఆలస్యంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.