: స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు... రూ. 1.18 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
వడ్డీ రేట్లు ఇప్పట్లో పెంచబోమన్న యూఎస్ ఫెడ్ సంకేతాలతో గత వారం నమోదైన లాభాల పర్వం కొనసాగింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపు కన్నా 50 పాయింట్ల లాభంలో ప్రారంభమైన సెన్సెక్స్, మరే సమయంలోనూ ఇక వెనుదిరగ లేదు. ఇక యూరప్ మార్కెట్లు ప్రారంభమైన తరువాత మరింత ఉత్సాహంగా నూతన కొనుగోళ్లు జరగడంతో చివరి గంటన్నర వ్యవధిలో సెన్సెక్స్ బుల్ దూసుకెళ్లింది. మరిన్ని ఎఫ్ఐఐ నిధులు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ. 1.18 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 25 వేల మార్క్ ను మరోసారి అధిగమించింది. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 332.63 పాయింట్లు పెరిగి 1.33 శాతం లాభంతో 25,285.37 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 99.90 పాయింట్లు పెరిగి 1.31 శాతం లాభంతో 7,704.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.40 శాతం, స్మాల్ క్యాప్ 1.36 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 40 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. అంబుజా సిమెంట్స్, అల్ట్రా సిమెంట్స్, బోష్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ తదితర కంపెనీలు లాభపడగా, ఏషియన్ పెయింట్స్, లుపిన్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా, గెయిల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,849 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,497 కంపెనీలు లాభాల్లోను, 1,163 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాడు రూ. 92,76,638 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 93,93,400 కోట్లకు పెరిగింది.