: కోర్టు నిర్ణయం తర్వాతే వైసీపీ భవిష్యత్ కార్యాచరణ!... సాయంత్రం మరోసారి భేటీ
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను కొనసాగించేందుకే ఏపీ అసెంబ్లీ నిర్ణయించడంతో వైసీపీ డైలమాలో పడిపోయింది. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఒకింత సంతోషం వ్యక్తం చేసిన వైసీపీ... ప్రివిలేజ్ కమిటీ కఠిన నిర్ణయంతో షాక్ తిన్నది. మరోవైపు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ... లోటస్ పాండ్ లోని కార్యాలయంలో భేటీ అయ్యింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘంగా కొనసాగిన వైసీఎల్పీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ క్రమంలో డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిన తర్వాతే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత నేటి సాయంత్రం మరోమారు భేటీ కావాలని జగన్ నిర్ణయించారని వారు తెలిపారు.