: రిజర్వేషన్లు తీసేస్తామన్నది అభూతకల్పన: మోదీ


ఇండియాలోని దళితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని, బీజేపీ సర్కారు రిజర్వేషన్లను తీసేస్తుందని జరుగుతున్న ప్రచారం అభూతకల్పనేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఉదయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. "వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో సైతం రిజర్వేషన్లను తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన రెండుసార్లు ప్రధానిగా సేవలందించినా, అది జరగలేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం, దళితులు, షెడ్యూల్డ్ తెగలకు అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. ప్రజలను తప్పుదారి పట్టినస్తున్న వారి మాటలు నమ్మకండి" అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ నేతగా పేరున్న మార్టిన్ లూథర్ కింగ్ తో సమానమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన ఆయన, అంబేద్కర్ దళితులకు మాత్రమే ప్రతినిధి కాదని, దేశప్రజలకు, సమాజంలో చిన్న చూపు ఎదుర్కొంటున్న వారికి అండగా గొంతెత్తిన మహానుభావుడని వివరించారు. ఇండియాలో పేదలు, మధ్య తరగతి ప్రజల అభివృద్ధికి ఆయన చూపిన దారి సర్వదా అనుసరణీయమని పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించకుంటే, కేంద్రంలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి అంబేద్కరని, మహిళలకు హక్కులు కోరుతూ, అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారన్న సంగతి కొద్ది మందికే తెలుసని అన్నారు. ఏప్రిల్ 14, 2018న ఈ భవంతి నిర్మాణం పూర్తి చేసుకుంటుందని, తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News