: జగన్ బెస్ట్ ఆఫర్లన్నీ బుగ్గనకే!
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పేరిట కొత్త పార్టీ పెట్టేదాకా ఎవరికీ తెలియని పేరు. వైసీపీని ఆవిష్కరించిన జగన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేపట్టిన సందర్భంగా కర్నూలు జిల్లా డోన్ లో చేసిన ప్రసంగంలో ఓ సంచలన ప్రకటన చేశారు. అప్పటికి ఇంకా ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయముండగానే తన పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థిని జగన్ ప్రకటించారు. డోన్ టికెట్ బుగ్గన రాజేంద్రనాథ్ కే ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. నాడు జగన్ చేసిన ఆ ప్రకటనతో రాష్ట్ర రాజకీయ పరిశీలకులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 'మాట తప్పమని... మడమ తిప్పమని' నినాదంతో ముందుకెళ్లిన జగన్... ఇచ్చిన హామీ మేరకు రాజేంద్రనాథ్ కు డోన్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఇక తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన బుగ్గనపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పోటీకి దిగారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న డోన్ లో 11,152 ఓట్ల మెజారిటీతో కేఈ ప్రతాప్ ను చిత్తు చేసిన బుగ్గన... తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత గత అసెంబ్లీ సమావేశాల్లో ఓ సందర్భంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన బుగ్గన... కేఈని నిండు సభలో అంకుల్ అని పిలిచి నవ్వులు పండించారు. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రసంగించిన ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. యనమల బడ్జెట్ ను తూర్పారబట్టడంలో బుగ్గన సఫలీకృతులయ్యారు. బుగ్గన చేసిన ప్రసంగం ఇటు విపక్ష సభ్యులనే కాక అధికార పార్టీ సభ్యులను కూడా ఆకట్టుకుంది. ఈ కారణంగానే ఏమో... సీనియర్లందరినీ పక్కనబెట్టిన జగన్... పీఏసీ చైర్మన్ పదవికి బుగ్గనను ఎంపిక చేశారు. వెరసి జగన్ నుంచి వెలువడ్డ బెస్ట్ ఆఫర్లన్నీ బుగ్గనకే దక్కాయి.