: సారీ చెప్పి తప్పించుకున్న జ్యోతుల, కోటంరెడ్డి, చెవిరెడ్డి... కొడాలి సారీ చెప్పినా శాంతించని ప్రివిలేజ్ కమిటీ
ఏపీ అసెంబ్లీ గత సమావేశాల్లో అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని)లు సభా నియమాలను ఉల్లంఘించారంటూ అధికార పక్షం సభా హక్కుల కమిటీ (ప్రివిలేజ్ కమిటీ)కి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సభలో చంద్రబాబు, స్పీకర్ కోడెలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రోజాపై ప్రివిలేజ్ కమిటీతో సంబంధం లేకుండానే ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు చెప్పిన నేపథ్యంలో మరోమారు కలకలం రేగింది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం సభకు ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను అందజేసింది. ఈ నివేదికలో కమిటీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని రోజాపై సస్పెన్షన్ ను కొనసాగించడంతో పాటు అలవెన్సులను నిలిపివేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఇక జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తమ ముందు విచారణకు హాజరై క్షమాపణలు చెప్పారని, భవిష్యత్తులో సభా నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు అవసరం లేదని సభకు సూచించింది. ఇక విచారణకు హాజరై క్షమాపణ చెప్పిన కొడాలి నానిపై మాత్రం కమిటీ కనికరం చూపలేదు. సభలో తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పిన నాని వ్యవహారం క్షమించరానిదేనని కమిటీ తన నివేదికలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కొడాలిపై చర్యలు తీసుకోవచ్చని, అయితే ఆ విషయాన్ని సభకే వదిలేస్తున్నట్లు కమిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో కొడాలిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.