: తాజా లెక్కలు... భారతీయులు దాచుకున్న నల్లధనం రూ. 12.25 లక్షల కోట్లు!
ప్రపంచంలో దాగున్న నల్లధనంపై తాజా లెక్కలు బయటకు వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ ఇటలీ ఆర్థికవేత్తలు వేస్తున్న అంచనాల ప్రకారం, మొత్తం 6 నుంచి 7 ట్రిలియన్ డాలర్ల వరకూ నల్లధనం దాగుంది. ఇందులో భారతీయుల వాటా 152 బిలియన్ డాలర్ల నుంచి 181 బిలియన్ డాలర్ల మధ్య (సుమారు రూ. లక్ష కోట్ల నుంచి రూ. 12.25 లక్షల కోట్లు) ఉంటుందని వివరించారు. ఈ మొత్తం బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటీ వాటాల్లో పెట్టుబడులుగా ఉన్న మొత్తమని, ఇక నిర్మాణరంగం, బంగారం కొనుగోళ్లు తదితరాలను లెక్కిస్తే, నల్లధనం మరిన్ని వేల కోట్లు పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇటలీ నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థపై నియంత్రణ తక్కువగా ఉన్న దేశాల్లో, చట్టపరమైన లొసుగులు అధికంగా ఉన్న దేశాల్లో ఈ పెట్టుబడులు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థూల జాతీయోత్పత్తికి ఎంత భాగముందో, నల్లధనం విషయంలోనూ అంతే భాగముండటం గమనార్హం. ఇక ఇటీవలి కాలంలో నల్లధనం వెలికితీత దిశగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా కేవలం 0.07 శాతం ఆస్తులు మాత్రమే వెల్లడయ్యాయని అంచనా వేశారు. ఇక భారతీయులు వివిధ రకాల స్థిర, చరాస్తుల్లో రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్ల వరకూ నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేశారని తెలుస్తున్నట్టు తెలిపారు.