: చంద్రబాబు, కోడెలపై క్రిమినల్ చర్యలు తీసుకోండి!... హైకోర్టులో పిల్!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న గోపాలకృష్ణ కళానిధి ఈ పిల్ ను దాఖలు చేశారు. వైసీసీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు రోజా వెళ్లగా, ఆమెను మార్షల్స్ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వలేదు. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా చంద్రబాబు, కోడెల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కళానిధి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు, కోడెలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News