: బ్యాంకులను మోసం చేసేందుకు కార్పొరేట్ల 'డూప్లికేట్' రూట్!


ఇండియాలో బ్యాంకులను మోసం చేస్తున్న కంపెనీల ముఖచిత్రంగా యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా మారిన వేళ, మొత్తం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరుపైనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నో ప్రైవేటు కంపెనీలు బ్యాంకులను తమదైన శైలిలో మోసం చేస్తూ, కోట్లాది రూపాయలను రుణాల రూపంలో తీసుకుని ఎగ్గొడుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికార వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం, 900 మంది వరకూ ఉద్దేశపూర్వక ఎగవేతదారులున్నారు. ఇక ఈ పేర్లను పరిశీలిస్తే, చాలా వరకూ ఒకేలా కనిపిస్తుండగా, చాలా కంపెనీలు ఒకే చిరునామాపై రిజిస్టర్ అయివుండటం గమనార్హం. ఈ కంపెనీలు డూప్లికేట్ కంపెనీలను సృష్టించి మరీ బ్యాంకులను బురిడి కొట్టించినట్టు సులువుగానే అర్థమవుతోంది. ఉదాహరణకు మూడు కంపెనీలు 'యాపిల్' అన్న పదాన్ని తమ రిజిస్టర్ పేరులో పెట్టుకుని బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టాయి. యాపిల్ కమోడిటీస్, యాపిల్ స్పాంజ్, యాపిల్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న కంపెనీలు, అనుపమ్ ప్లాజా, హౌజ్ ఖాస్, సౌత్ ఢిల్లీ పేరిట ఉన్నాయి. ఈ మూడు కంపెనీలూ బ్యాంకులకు ఎగ్గొట్టింది రూ. 400 కోట్లు. ఇక ఈ కంపెనీలు ఇచ్చిన చిరునామాకు వెళితే, అక్కడ ఎలాంటి ఆఫీసులూ లేవు. ఇక ఇదే జాబితాలో 17 కంపెనీలు ఈస్ట్ ఢిల్లీలోని రాంనగర్ ప్రాంతంలోని భగవాన్ పూర్ ఖేరా చిరునామాతో ఉన్నాయి. ఇవే కాదు. ఢిల్లీ కేంద్రంగా ఒకేలా పేరున్న కంపెనీల పేర్లు పెట్టుకుని, బ్యాంకులను మోసం చేసిన వారి సంఖ్య వందల్లోనే ఉంది. వీటిల్లో చాలావరకూ మూతపడగా, ఇక కొన్ని కంపెనీలు నామమాత్రం పనిచేస్తున్నా అక్కడి ఉద్యోగులకు తాము ఏం పని చేస్తున్నామన్నది కూడా తెలియని స్థితి. ఇదే వెబ్ సైట్ లో ముంబై కేంద్రంగా రిజిస్టర్ అయిన, నాలుగు కంపెనీలు ఒకే చిరునామాను కలిగివున్నాయి. అర్మాన్ ఫుడ్స్, ఆర్యా ఎంటర్ ప్రైజస్, హనీ టేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాజిక్ టైమ్ ట్రేడింగ్ కంపెనీలు రూ. 40.38 కోట్లు బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరు చూపించిన అధికారిక చిరునామా, పాన్వెల్ లోని గురుచరణం కాంప్లెక్స్ కు వెళితే, అక్కడో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. సదరు కంపెనీల డైరెక్టర్లు మిథిలేష్ రాజ్ పుత్, దేవ్ ప్రకాష్ రాజ్ పుత్ లు అక్కడ నివసించడం లేదని, అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారని సెక్యూరిటీ గార్డులు చెప్పడం కొసమెరుపు. ఇక ఇలాంటి వారందరికీ, ముందూ వెనకా చూసుకోకుండా కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని రుణాలుగా ఇచ్చి, ఆపై వారిని డిఫాల్టర్లంటూ, ఆ మొత్తాలను నిరర్థక ఆస్తుల రూపంలో చూపుతూ, ఒకసారి నష్టాన్ని ప్రకటించి తప్పించుకుపోతున్న బ్యాంకింగ్ వ్యవస్థను ఏమనాలి?

  • Loading...

More Telugu News