: ఆర్జనలో దూసుకెళుతున్న కోహ్లీ!... ‘కిట్’ ఆదాయంలో కెప్టెన్ కూల్ ను దాటేసిన వైనం
ఆదాయంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఇతర క్రికెటర్ల కంటే మెరుగ్గానే ఉన్నాడు. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న అతడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే అతడి నుంచి టీమిండియా టెస్టు జట్టు పగ్గాలను దక్కించుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆర్జనలో శరవేగంగా దూసుకువస్తున్నాడు. మొత్తం ఆదాయంలో ప్రస్తుతం ధోనీనే టాప్ పొజిషన్ లో ఉన్నా... ‘కిట్’ ఆదాయంలో మాత్రం విరాట్ కోహ్లీ నెంబర్ వన్ గా నిలుస్తున్నాడు. వాణిజ్య ప్రకటనలను పక్కనబెడితే... బ్యాటు, బూట్లు ఇతర వస్తువులపై ఆయా వ్యాపార సంస్థల గుర్తులకు చోటిచ్చిన ధోనీ అందుకు గాను ఏటా రూ.6 కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే కోహ్లీ... ధోనీ కంటే మరో రూ.4 కోట్లు అదనంగా ఏకంగా రూ.10 కోట్లు జేబులో వేసుకుంటున్నాడు. తన బ్యాట్ పై ఎంఆర్ఎఫ్ కంపెనీ ముద్రకు అనుమతిచ్చిన కోహ్లీ... అందుకు రూ.8 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక బూట్లతో పాటు తన కిట్ బ్యాగులోని ఇతర వస్తువులపై పలు వాణిజ్య సంస్థల గుర్తులకు చోటిచ్చిన కోహ్లీ... అందుకు గాను రూ.2 కోట్లు ఆర్జిస్తున్నాడు. వెరసి కోహ్లీ ‘కిట్’ ఆదాయం రూ.10 కోట్లకు చేరింది. ఇక ‘కిట్’ ఆదాయానికి సంబంధించి ఇతర క్రికెటర్ల విషయానికొస్తే... యువరాజ్ సింగ్ రూ.4 కోట్లు, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు రూ.3 కోట్ల చొప్పున, ఏబీ డివిలియర్స్ రూ.3.5 కోట్లు, క్రిస్ గేల్ రూ.3 కోట్ల మేర ఆర్జిస్తున్నారు.