: కింకర్తవ్యం!... మరికాసేపట్లో లోటస్ పాండ్ లో ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ కు సంబంధించి అసెంబ్లీలో నేడు కీలక చర్చ జరగనుంది. రోజాతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని), చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులపైనా చర్యల విషయంలో ప్రివిలేజ్ కమిటీ విచారణ పూర్తయింది. నేటి సమావేశాల్లో భాగంగా కమిటీ తన నివేదికను సభకు సమర్పించనుంది. రోజాతో పాటు కొడాలి నానిపై చర్యలు తప్పవన్న వదంతుల నేపథ్యంలో వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో కీలక భేటీని నిర్వహించనున్నారు. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు చెందిన సింగిల్ జడ్డీ బెంచ్ ఇచ్చిన తీర్పును అసెంబ్లీ సెక్రటేరియట్ సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు కోర్టుల కంటే సభనే సుప్రీం అనే తరహాలో ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే రోజాను సభలో అడుగుపెట్టనివ్వని సర్కారు వైఖరికి నిరసనగా నేటి సమావేశాలకు హాజరు కారాదని వైసీపీ తీర్మానించింది. ఈ క్రమంలో ప్రభుత్వం వైఖరిని తిప్పికొట్టే వ్యూహాలకు జగన్ పదును పెడుతున్నారు. ఇందుకోసం మరికాసేపట్లో ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీ వ్యవహరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణను జగన్ రూపొందిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News