: ఓడారుగా... మీరిచ్చిన డబ్బు ఇదుగోండి!: ఓడిన అభ్యర్థి పై ఖమ్మం ఓటర్ల ఔదార్యం!


ఎన్నికల్లో తాయిలాల ఎర తప్పనిసరిగా మారిపోయింది. మద్యం సీసా, పచ్చ నోటు లేనిదే పనికావడం లేదు. గెలిస్తే ఓకే కానీ, మరి ఓటమి పాలయ్యే అభ్యర్థి మాత్రం ఎన్నికల తర్వాత తీవ్ర అప్పుల్లో కూరుకుపోవడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఇలా డబ్బు ఖర్చు పెట్టి కూడా ఓటమిపాలైన ఓ అభ్యర్థికి ఖమ్మం ఓటర్ల నుంచి వింత అనుభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో సదరు అభ్యర్థి ఇచ్చిన డబ్బులను ఖమ్మం ఓటర్లు తిరిగిచ్చేశారు. ఇలా ఓటర్ల నుంచి తిరిగి ఆ అభ్యర్థి వద్దకు చేరింది చిన్న మొత్తమేమీ కాదు. ఏకంగా రూ.15 లక్షలను పోగేసిన ఓటర్లు ఆ డబ్బును ఓ వ్యక్తికి ఇచ్చి ఓడిన అభ్యర్థికి భద్రంగా అందజేశారు. వినడానికి వింతగానే ఉన్నా, ఈ విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివరాల్లోకెళితే... ఇటీవల ఖమ్మం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా ఓ డివిజన్ నుంచి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి భారీగానే ఖర్చు పెట్టారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సదరు అభ్యర్థి ఓటుకు ఇంత అంటూ ఓటర్లకు డబ్బు కూడా పంపిణీ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో తీవ్ర విచారంలో కూరుకుపోయిన సదరు అభ్యర్థి ఇంటికే పరిమితమైపోయారు. దీంతో సదరు అభ్యర్థి బాధను గుర్తించిన ఆ డివిజన్ ఓటర్లు రెండు రోజుల క్రితం గుట్టుగా సమావేశమై... ఆ అభ్యర్థి వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఆ అభ్యర్థి నుంచి తీసుకున్న మొత్తాన్ని ఎవరికి వారు తిరిగిచ్చేయడం ప్రారంభించారు. ఇలా మొన్న రాత్రికి ఆ డబ్బు రూ.15 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని మొన్న రాత్రే ఓటర్లు ఓ వ్యక్తి ద్వారా సదరు ఓడిన అభ్యర్థికి అందజేశారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News