: నాకు హీరో అంటే చిరంజీవి గారే!: పవర్ స్టార్ పవన్ కల్యాణ్
‘హీరో అంటే చిరంజీవి గారు తప్ప, మరెవ్వరూ నాకు లేరు’ అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఇంతటి వాడినయ్యానంటే దానికి కారణం తన అన్నావదినలేనని చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘నాకు అమితాబ్ బచ్చన్ గారంటే చాలా ఇష్టం. అయితే, మా ఇంట్లో నుంచి ఒక హీరో వచ్చిన తర్వాత చిరంజీవి గారే నాకు హీరో అయ్యారు. అన్నయ్య షూటింగ్ కి వెళ్లి రాత్రి ఎప్పుడో వచ్చేవారు. కనీసం తన షూలు కూడా విప్పుకోలేనంతగా అలసిపోయేవారు. అప్పుడు నేను ఆ షూలు విప్పేవాడిని. అప్పుడు ఆ సాక్స్ ల చెమట వాసన నాకు కంపుగా అనిపించేది కాదు, సువాసనగా అనిపించేది. ఎందుకంటే, కష్టంతో తడిసిన సాక్స్ లు అవి. ఇక మా బంధం వేరు.. రాజకీయాలు వేరు. నాకు అన్నయ్య గుండెల్లోనే ఉంటారు. ఆ విషయాన్ని నేను పదేపదే ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా తల్లిదండ్రుల తర్వాత అంతటివారు నాకు అన్నయ్యా వదినే. అన్ని విలువలు ఉన్న కమర్షియల్ సినిమా అంటే అన్నయ్యకు చాలా ఇష్టం. అందుకే అన్నయ్యను అతిథిగా పిలిచాం. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే, ఏప్రిల్ లో దీనిని రిలీజు చేయాలని చెప్పి అందరినీ చాలా తొందరపెట్టేశాను. నా చిత్రంలో అలీ లేకపోతే చాలా లోటుగా ఉంటుంది. అందుకే నా సినిమాల్లో అలీ ఉంటాడు. కాజల్ చాలా బాగా చేసింది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అభిమానుల కోరిక మేరకు పవన్ కల్యాణ్ ఈ చిత్రంలోని ఒక డైలాగ్ ను చెప్పారు. అంతకుముందు, ‘మెగా’ బ్రదర్స్ ఇద్దరూ స్టేజ్ పై నుంచి ప్రేక్షకులతో సెల్ఫీ దిగారు.