: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రూ.100 కోట్ల బిజినెస్ చేస్తోంది!: మెగాస్టార్ చిరంజీవి
చాలా కాలం తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్ తో కలిసి ఆడియో వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మధ్య కాలంలో తాను రిపీటెడ్ గా చూసిన సినిమా 'గబ్బర్ సింగ్' అని అన్నారు. టీవీల్లో వస్తుంటే అలానే అతుక్కుపోయేలా తాను చూసిన చిత్రం 'గబ్బర్ సింగ్' మాత్రమేనని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రతి ఫ్రేమ్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం మాతృక అయిన ‘దబాంగ్’కు, దీనికి చాలా తేడా ఉందని అన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత తనకు అర్థమైంది ఏమిటంటే, పవన్ కల్యాణ్ ట్రెండ్ ఫాలో అవడని, ట్రెండ్ క్రియేట్ చేస్తాడని అన్నారు. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథ, స్క్రీన్ ప్లే పవన్ దని, దాని ఇన్ పుట్స్ తీసుకుని అద్భుతంగా తెరకెక్కించింది దర్శకుడు బాబీ అని అన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ కు తాను వెళ్లానని, ఈ సెట్స్ ను చూస్తుంటే నాటి సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘షోలే’ గుర్తుకు వచ్చిందన్నారు. పవన్ లో హ్యుమర్ ఏంగ్లీ కూడా ఉందని, ఈ చిత్రం పూర్తి స్థాయిలో అలరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తమ జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని చిరంజీవి గుర్తుచేశారు. చిత్ర రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దని, ఈ సందర్భంగా తాను పవన్ కు ఒక సలహా ఇస్తున్నానని చిరంజీవి అన్నారు. పవన్ కు నచ్చిన మరో రంగంలో కూడా కొనసాగాలని ఉన్నప్పటికీ, ఈ రంగాన్ని మాత్రం వదిలివేయవద్దని అన్నారు. ఈ చిత్రం రికార్డులు సృష్టించాలని కోరుకున్నారు. ఈ సినిమాలో ‘ఇంద్ర’ స్టెప్పు పవన్ వేశాడని, ఈ చిత్రంలో ఆ స్టెప్పు పవన్ ఏ విధంగా వేశాడో చూడాలని తనకు చాలా ఆసక్తిగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ కు, తనకు సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం రూ.100 కోట్లు బిజినెస్ చేయబోతుందన్న వార్త తనకు చాలా సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. ఈ సందర్భంగా కాజల్ గురించి మాట్లాడుతూ, చందమామ అంటే కాజల్ అనిపించేలా ఉంటుందని, ఈ సినిమాకు గ్లామర్ తీసుకువస్తుందంటూ చిరంజీవి ఆమెను ప్రశంసించారు.